Amaravati, May 21: రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని (Heat Wave Warning) తెలిపింది. ఈ నెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి
దీనికి ముందస్తు సంకేతంగా ఈనెల 22 నుంచి ఎండలు భగ్గుమనడంతోపాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఐఎండీ కూడా ఇవే హెచ్చరికలు జారీ చేసింది. శుక్ర, శని, ఆది వారాల్లో యానాంతోపాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది.
గుంటూరు జిల్లా రెంటచింతలలో గత మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42–43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.
రోహిణి కార్తె సమీపించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఎక్కువని తెలిపారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలని కోరారు.