Tirumala, July 5: తిరుమల శ్రీవారికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో (Tirumala hundi nets Rs 6.18 crore) సమర్పించుకున్నారు. చరిత్రలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగా తిరుమలకు (Tirumala Tirupati Devasthanam) రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. టీటీడీ అధికారికంగా మంగళవారం హుండీ కానుకల లెక్కను ప్రకటించనుంది.
తిరుమల కొండపై వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 4 కిలోమీటర్ల పొడవు క్యూలో వేచి ఉండగా.. తిరుమలలోని వసతి కౌంటర్లలో కూడా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిచ్చాయి.
ఏపీ రాష్ట్రంలో విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత రెండు రోజులుగా యాత్రికుల రద్దీ పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్‌లు నిండాయి.
రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కంపార్ట్‌మెంట్ల వద్ద, లైన్ల వెలుపల నారాయణగిరి గార్డెన్స్, లేపాక్షి సర్కిల్, అవతల నిలబడి ఉన్న యాత్రికులతో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. క్యూ లైన్లలో భక్తులకు నిరంతరం అన్నదానం, తాగునీరు, ఇతర పానీయాల సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.