Hyderabad, Feb 9: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర (Nagoba Jatara) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా (Adilabad) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మెస్రం వంశీయుల చేతుల మీదుగా జరిగే ఈ ఉత్సవం ఆదివాసీలకే కాదు మిగతా వర్గాలకు ప్రత్యేకమే. దాదాపు 400 మంది గిరిజనులు నివసించే కేస్లాపూర్ కు జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు సహా ఇతర రాష్ట్రాల నుంచీ లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.
ఈ రోజు నుంచి నాగోబా జాతర https://t.co/GVegTG37U6
— V6 News (@V6News) February 9, 2024
అధికారికంగా నిర్వహణ
మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబాను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్ వచ్చి పూజలు నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈసారి జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఏస్పీల ఆధ్వర్యంలో, ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలు, 37 మంది ఏఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లు 243 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
జాతర ఇలా..
శుక్రవారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభవుతుంది. మూడు రోజుల అనంతరం 12న దర్బార్తో ముగుస్తుంది. మెస్రం వంశీయులు 80 కిలోమీటర్ల దూరంలోని హస్తిన మడుగు దాకా వెళ్లి తీసుకొచ్చిన గోదావరి జలాలతో నాగోబాకు తొలుత అభిషేకం చేస్తారు. జాతరకు మూడు రోజుల ముందే ఈ జలాలను సేకరిస్తారు. బుధవారం అర్దరాత్రి పెద్దలకు కార్మకాండ ( తూమ్ ) పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశానికి చెందిన కోడలు సతీదేవి ఆలయంలో కలసిన తర్వాత తెల్లని దుస్తులు ధరించి పూజలు చేస్తున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లు భావిస్తారు. మరుసటి రోజు పెర్సెపెస్, బంపేస్, మందగజిలిపూజ మరియు బేతాళ పూజ నిర్వహిస్తారు.