Tirumala, August 31: తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో 35 బ్యాటరీ వాహనాలను ప్రారంభించిన సుబ్బారెడ్డి.. అదే వాహనంలో తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించారు. తిరుపతికి చేరుకున్న ఆయన అలిపిరిలోని గరుడ కూడలి వద్ద మీడియాతో మాట్లాడారు.
పర్యావరణ పరిరక్షణకు మూడు విడతల్లో చర్యలు చేపట్టాలని గత పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో టీటీడీ ఉద్యోగుల కోసం బ్యాటరీ వాహనాలను సమకూర్చినట్లు చెప్పారు. రెండో దశలో తిరుమలలో, మూడో దశలో కనుమ రహదారిలో 100 ఎలక్ట్రిక్ బస్సులను యాత్రికుల కోసం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. విద్యుత్ బస్సుల కోసం త్వరలోనే టెండర్లను పిలుస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలకమండలి లేని సమయంలో అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టారని తెలిపారు. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదని స్పష్టంచేశారు. ట్రయల్న్ విజయవంతం కాకపోవడంతో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.
సంప్రదాయ భోజనంపై సోషల్‌మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని భక్తులు నమ్మొద్దని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉచిత సర్వదర్శనాలపై అధికారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నామని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.