తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు.శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి.అదేవిధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
తిరుమలలో వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అన్ని కంపార్ట్‌మెంట్లు, షెడ్లు నిండిపోయి మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ.3.77 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.