తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది. దీంతో పాటుగా సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఇదిలా ఉంటే శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తెలిపారు.తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. సదరు వీడియోను పరిశీలించిన అనంతరం ఇందుకు కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాలు
– ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి.
– ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.
– ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం.
– ఫిబ్రవరి 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం.
– ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి.
– ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.
రథసప్తమి పర్వదినంలో వాహనసేవల వివరాలు :
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.