Washington, June 14: కరోనా బారినపడి చనిపోతున్న వారిలో ఎక్కువ మంది వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారే ఉంటున్నారు. అయితే ఓ 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడాడు, మరణం అంచుల దాకా వెళ్లి మరీ ఈ మహమ్మారిని జయించాడు. దీంతో ఆ పెద్దాయనకు, ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇక ఆనందంతో డిశ్చార్జ్ అయ్యే సమయంలో చికిత్సకు సంబంధించిన బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన వారికి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. రోజుల తరబడి చేసిన చికిత్సకు ఎప్పుడు, దేనికి ఎంతైందో వివరిస్తూ ఆసుపత్రి యాజమాన్యం 181 పేజీల బిల్లు ఇచ్చింది. మొత్తం బిల్లు 1,122,501.04 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 8,52,61,811.50/-. మరి ఆ తర్వాత ఏమైంది?
వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని సియాటెల్‌కు చెందిన మేఖేల్ ఫ్లోర్ అనే 70 ఏళ్ల వ్యక్తి మార్చి 4న కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఒక దశలో అతడి పరిస్ధితి విషమించడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో అక్కడి నర్సులు ఫోన్లో మాట్లాడించారు. అనంతరం చికిత్సకు స్పందిస్తూ క్రమంగా కోలుకుంటూ వచ్చిన మైఖేల్ పూర్తి ఆరోగ్యంతో 62 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఈ 62 రోజులకు గానూ ఇంటెన్సివ్ కేర్ రూమ్‌కు, వెంటిలెటర్ కు ఇతర అన్ని ఖర్చులకు కలిపి మన కరెన్సీ ప్రకారం రూ. 8.5 కోట్ల బిల్లు వచ్చింది. అది సగటు అమెరికన్లకైనా 1.1 మిలియన్ డాలర్ల బిల్లంటే మామూలు విషయం కాదు.
ఆ బిల్లు చూసి మేఖేల్ మరియు అతడి కుటుంబ సభ్యుల ఆనందం ఆవిరైంది. అయితే అతడికి బీమా పాలసీ కవర్ చేయబడి ఉండి, అమెరికాలో కోవిడ్ కి కూడా బీమా వర్తించడంతో ఆ బిల్లంతా ప్రభుత్వమే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఎంతో మంది టాక్స్ పేయర్ల డబ్బు ఇలా తన చికిత్స కోసం ఉపయోగించు కోవడం గిల్టీగా ఉందని మైఖేల్ ఫ్లోర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనావైరస్ లాక్డౌన్ల తర్వాత అమెరికన్ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా COVID-19 రోగులకు చికిత్స చేసిన ఆసుపత్రులు మరియు ప్రైవేట్ భీమా సంస్థలకు పరిహారం చెల్లించడానికి కూడా సుమారు 100 మిలియన్ల బడ్జెట్ సమకూర్చింది.