సాధారణంగా మరణించిన మనిషి ఈ ప్రపంచం నుండి విముక్తి పొందుతారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే బీహార్ రాజధాని పాట్నాలో ఓ దిమ్మతిరిగే కేసు వెలుగులోకి వచ్చింది. ఓ డెడ్ బాడీ తన డబ్బును డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు (Dead Body in Bank) వచ్చింది. ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. అయితే శవం ఎందుకు వెళ్లింది (Dead man’ arrived to withdraw money in bank) అని అనుకుంటున్నారా..అయితే ఓ సారి స్టోరి చదవాల్సిందే..
రాజధాని పాట్నాకు ఆనుకొని ఉన్న పాట్నా సిటీ సబ్ డివిజన్‌లోని షాజహన్‌పూర్ పోలీస్ స్టేషన్ (Shahjahanpur Police Station) ప్రాంతంలోని సిగ్రియావాన్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల మహేష్ యాదవ్ ఈ ఉదయం అనారోగ్యంతో మరణించారు. అతని మరణం తరువాత, గ్రామస్తులు అతని అంత్యక్రియలకు బ్యాంక్ ఖాతా నుండి డబ్బు అడిగారు. అతని అకౌంట్లొ లక్ష రూపాయలు ఉన్నాయి. అయితే బ్యాంకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో గ్రామస్తులు బ్యాంకు లోపలకి శవాన్ని తీసుకు వెళ్లి ఉంచారు.
దీంతో కెనరా బ్యాంక్ శాఖలో అకస్మాత్తుగా గందరగోళం నెలకొంది. దాదాపు మూడు గంటలు శవం బ్యాంకులో అలాగే ఉండిపోయింది.బ్యాంకు మేనేజర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వినిపించుకోలేదు. చివరికి చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరే తన సొంత ఖాతాలోంచి రూ.10 వేలు డ్రా చేసి ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్లి గ్రామస్తులు మహేశ్ అంత్యక్రియలు పూర్తిచేశారు.
వాస్తవానికి, మరణించిన మహేష్కు వివాహం కాలేదు మరియు అతని వెనుక ఎవరూ లేరు. అతని బ్యాంకు ఖాతాలో లక్ష పద్దెనిమిది రూపాయలు ఉన్నాయి. కానీ అతనికి బ్యాంకు ఖాతాలో నామినీ లేదు. అతను KYC కూడా చేయలేదు. ఈ కారణంగా, బ్యాంక్ మేనేజర్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ ఘటన తరువాత బ్యాంక్ మేనేజర్ తన తరపున దహన సంస్కారాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మృతదేహంతో పాటుగా దహన సంస్కారాలకు వెళ్ళాడు.