Newyork, Nov 22: వెర్రి వెయ్యి విధాలు అంటారు పెద్దలు. మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే. ఆకలేస్తే బండి మీద ఓ డజను అరటిపండ్లు (Banana) కొంటాం. మహా అయితే, ఓ రూ. 60-70 ఇస్తాం. అయితే, న్యూయార్క్ (Newyork) లో బుధవారం జరిగిన వేలంలో ఒక అరటిపండుకు ఏకంగా ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 52.7 కోట్లు) చెల్లించాడు. పోనీ అదేదో ఔషద గుణాలు, సౌందర్యాన్ని అందించే లేదా వజ్రాలు పొదిగిన పండు కావొచ్చేమో అనుకుంటే అదీ లేదు. గోడకు టేపుతో అతికించి ఉన్న ఓ మామూలు అరటిపండు అది.
Duct-taped banana goes for $6.2 million in Sotheby's art auction https://t.co/up0taC4WuV pic.twitter.com/Q0WgTslNHY
— Reuters Tech News (@ReutersTech) November 21, 2024
ఏం చేస్తాడో తెలుసా?
ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో ఇలాంటి అరటిపండును సృష్టించాడు. గోడపై ఒక అరటిపండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ పండు వార్తల్లోకి ఎక్కగా తాజాగా దీనిని వేలం వేయగా రూ. 52.7 కోట్లకు అమ్ముడుపోయి మరోమారు హెడ్ లైన్స్ కు ఎక్కింది. చైనా పారిశ్రామికవేత్త జస్టిన్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు. ఈ పండును తాను తింటానని జస్టిన్ సన్ పేర్కొనడం విశేషం. తినడం కోసం ఇంత డబ్బు తగలేయాలా? అని నెటిజన్లు వాపోతున్నారు.