Newdelhi, Nov 18: రైలు ఆలస్యంతో వల్ల ముహూర్త సమయానికి ఓ వరుడు (Groom) మండపానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో అతన్ని పెండ్లి (Marriage) వేదికకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును ఆలస్యంగా నడిపింది. అత్యంత అరుదైన ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడికి అసోం రాజధాని గువాహటికి చెందిన అమ్మాయితో పెళ్లి ఖాయమైంది. అమ్మాయి ఇంటి వద్ద వివాహానికి ఏర్పాట్లు చేయడంతో చంద్రశేఖర్.. తన బంధువులు, స్నేహితులతో అక్కడకు రైల్లో బయలుదేరాడు. మొత్తం 34 మంది ఈనెల 14న ముంబైలో రైలెక్కి.. 15న హౌరాకు చేరుకుని అక్కడి నుంచి గువాహటికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఆ రైలు ఆలస్యంతో..
అయితే, ముంబై నుంచి హౌరా వెళ్లేందుకు వారు ఎక్కిన గీతాంజలి ఎక్స్ ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యమైంది. దాంతో హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్ ప్రెస్ అందుకోలేమని గ్రహించిన వరుడికి ఓ ఆలోచన వచ్చింది. అత్యవసర సహాయం కావాలంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టి.. దానికి తమ రిజర్వేషన్ టికెట్ల కాపీలను జత చేశాడు. తన సమస్యను వివరించి, తన వెంట వస్తున్నవారిలో సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారని, తనకు సాయం చేయాలని కోరాడు.
రైల్వే శాఖ స్పందన..
దీనికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ గీతాంజలి ఎక్స్ ప్రెస్ చేరుకునే వరకూ హౌరాలో సరైఘట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే జరిగింది. తన వివాహానికి సరైన సమయంలో చేరుకునేందుకు సహకరించిన రైల్వే శాఖకు, అధికారులకు చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలో తారాస్థాయికి చేరిన కాలుష్యం, అన్ని స్కూళ్లు మూసివేత, సోమవారం నుంచి తీవ్రమైన ఆంక్షలు..