Tree City of The World 2020: హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు,  'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020' జాబితాలో భాగ్యనగరానికి చోటు,  భారత్ నుంచి ఎంపికైన ఏకైక నగరంగా ఖ్యాతి
Sanjeevaiah Park, Hyderabad. | Photo Credits: PTI

Hyderabad, February 19: హైదరాబాద్‌కు మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని 'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020' గా ప్రకటించాయి. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా పేరు పొందింది.

ప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలను పరిగణలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ఎఫ్.ఏ.ఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది.

గతంలోకన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవులను పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు. 2021 మార్చి 1వ తేదిన గాని అంతకుముందేగాని హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించనున్నామని డాన్ లాంబే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

కాగా, హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020గా గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు లభించిన గుర్తింపు ఇది అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

హరితహారంలో భాగంగా  గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గించటమే లక్ష్యంగా ఇప్పటి వరకు 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది.

2016 నుండి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది.

నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ మరియు 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.