గురువారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు హసన్ మహమూద్ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. నాలుగో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రిషభ్‌పంత్ వంటి స్టార్ల వికెట్లను తీసుకుని షాకిచ్చాడు. అతడి దెబ్బకు 96 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌లలో ఆరు వికెట్లు పడగొట్టినప్పుడు హసన్ మొదటిసారి రెడ్-బాల్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. అతను గత నెలలో రావల్పిండిలో అద్భుతమైన ప్రదర్శనతో దానిని అనుసరించాడు, అక్కడ రెండవ ఇన్నింగ్స్‌లో అతని తొలి ఐదు వికెట్ల (5/43) మార్క్ బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో సహాయపడింది.
24 ఏళ్ల మహమూద్ మార్చి 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన మహమూద్ ఈ ఏడాది మొదట్లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి ఒక్కసారి ఫేమస్ అయ్యాడు. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో గెలుచుకుని చరిత్ర సృష్టించడంలో మహమూద్ కీలక పాత్ర పోషించాడు. చెన్నై టెస్టుకు ముందు మూడు టెస్టుల్లో మహమూద్ 14 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు నేలకూల్చాడు.