అక్కడో పెళ్లి జరుగుతోంది, పెళ్లికొచ్చిన అతిథులంతా నాలుగు అక్షింతలు వేసి, వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేసి వెళ్లిపోదామనుకున్నారు. కానీ ఎవరూ ఊహించలేని నవరసాల నాటకాన్ని ఆస్వాదించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడగానే పెళ్లికూతుర్ని తీసుకురండి అని పురోహితుడు పిలిస్తే, ఆపండి.. అంటూ మంటపంలోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. దీంతో పురోహితుడు సహా పెళ్లికొచ్చిన వారంతా అవాక్కయారు. ఆ పోలీసులను పిలిచింది పెళ్లికూతురే అని తెలిసి షాక్ అయ్యారు. అసలేం జరిగింది? తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.
మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, గుండెపూడికి చెందిన యువకుడికి మరియు అదే జిల్లాలోని కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు వరకు అంతా సవ్యంగానే సాగింది, ముహూర్తం దగ్గరపడగా, వధువు నేరుగా పెళ్లి మంటపం నుంచే 100కు ఫోన్ చేసి తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రేమించిన యువకుడిని వద్దని, బలవంతంగా పెళ్లిచేస్తున్నారని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు పెళ్లి మంటపానికి వచ్చి విచారణ చేపట్టారు. అందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, అమ్మాయి వినకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో వధువును పోలీసులు కౌన్సిలింగ్ కేంద్రానికి తరలించారు.
ఇక పెళ్లి ఆగిందని అవమానంగా భావించిన వధువు తరఫు వారు, ఎలాగైనా అదే ముహుర్తానికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. పెళ్లికి వచ్చిన సమీప బంధువుతో అక్కడే మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ యువకుడికి అదే మంటపంపై అక్కడికక్కడే పెళ్లి జరిపించారు.
దీంతో కథ సుఖాంతం అయింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనేది పాత మాట. అనుకుంటే మ్యాగి నూడుల్స్ కలిపినంత ఈజీగా ఎక్కడంటే అక్కడే నిర్ణయించవచ్చునేది లేటెస్ట్ ట్రెండ్. ఏది ఏమైనా గురువారం జరిగిన ఈ పెళ్లి ఘటన థ్రిల్లర్ సినిమాను తలపించిందనే చెప్పాలి.