Jyothi Yarraji Wins Gold Medal in Women’s 100m Hurdles Event

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది.

విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్‌ జేమ్స్‌ హీలియర్‌ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్‌లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది.జ్యోతితో పాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్‌ కుమార్‌ సరోజ్‌... పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్‌ పసిడి పతకాలు నెగ్గారు.

కంగ్రాట్స్ జ్యోతి, నీవు మేమంతా గర్వపడేలా చేశావంటూ జగన్ ట్వీట్, 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగమ్మాయి

అసుక తెరెదా (జపాన్‌; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్‌; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. ఇదిలా ఉంటే 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్‌ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్, రిలయెన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ, ఏపీ సీఎం జగన్ తదితరులు అభినందనలు తెలిపారు.