ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సీరిస్ (India vs Australia) ఆడనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో టీమిండియా గిల్ కు ఓపెనింగ్ జోడీగా (Kishan vs Rahul) ఎవరు వస్తారనే దాని గురించి జరుగుతున్న చర్చపై తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (All-rounder Hardik Pandya) స్పందించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టులోకి రానున్నట్లు తెలిపాడు. టీమిండియా నయా స్టార్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.
ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు ఆసీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా స్థానం లేదని స్పష్టమైంది. కాగా గత కొంతకాలంగా రాహుల్ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఈ కర్ణాటక బ్యాటర్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ను పక్కన పెట్టిన యాజమాన్యం గిల్‌కు అవకాశం ఇవ్వగా సెంచరీతో సత్తా చాటాడు.
ఈ క్రమంలో మార్చి 17- 22 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ముంబై, వైజాగ్, చెన్నైలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కావడంతో పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇషాన్‌కు ఓపెనర్‌గా లైన్ క్లియర్ అయింది. ఈ విషయాన్ని పాండ్యా స్వయంగా ధ్రువీకరించాడు.పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాహుల్ ఇప్పటికే వైస్ కెప్టెన్ హోదాను కోల్పోయాడు. వరుస వైఫల్యాలతో ఓపెనింగ్ స్థానాన్ని కూడా కోల్పోయిన అతడు.. మిడిలార్డర్‌లో ఆడేందుకు సమాయత్తమయ్యాడు.