Sri Lankan players celebrate a wicket (Photo credit: Twitter @OfficialSLC)

ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (89) ఒంటరి పోరాటం చేయగా.. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (5), ముష్ఫికర్‌ రహీమ్‌ (13), తన్జిద్‌ (0), మెహదీ హసన్‌ (5) విఫలమయ్యారు.

శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, తీక్షణ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు చరిత అసలెంక (62 నాటౌట్‌), సదీర సమరవిక్రమ (54) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.నాలుగు వికెట్లు తీసిన మతీశా పథిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సొంతగడ్డపై జూలు విదిల్చిన పాకిస్తాన్, పసికూన నేపాల్‌పై 238 పరుగుల తేడాతో ఘన విజయం

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకకు ఇది వరుసగా 11వ వన్డే విజయం. ఆ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు డిసెంబరు 2013-మే 2014 మధ్య వరుసగా 10 వన్డేల్లో, అంతకంటే ముందు ఫిబ్రవరి 2004-జులై 2004 మధ్య పదేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో పదేసి విజయాలతో ఆస్ట్రేలియా (2009-2010), సౌతాఫ్రికా (2013-2014) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.