వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపాడు. కేవలం 35 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచిన అక్షర్ పటేల్ భారత్ ని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 64 పరుగుల ఇన్నింగ్స్‌లో 3 పోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో (IND v WI 2nd ODI 2022) ఈ తరహా అద్భుత ఇన్నింగ్స్‌తో అక్షర్ పటేల్ 17 ఏళ్ల నాటి ధోని రికార్డును (Axar Patel Breaks MS Dhoni Record) బద్దలు కొట్టాడు.
వన్డేల్లో లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున 7 లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అక్షర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్‌లు బాదిన అక్షర్ ఈ ఘనత సాధించాడు. కాగా 2005లో జింబాబ్వేపై మూడు సిక్సర్లు బాదిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ అరుదైన రికార్డు తొలుత తన పేరిట లిఖించుకున్నాడు. భారత మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ కూడా 2011లో మూడు సిక్సర్లు బాది ధోని రికార్డును సమం చేశాడు.
ఇక తాజా మ్యాచ్‌లో వీరిద్దరి రికార్డులను అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తో భారత్ కైవసం చేసుకుంది.