రెండు దేశాల మధ్య ఉద్రిక్త సంబంధాల కారణంగా 2008 నుండి భారతదేశం పాకిస్తాన్‌లో ఆడలేదు. ఇరు జట్లు ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ లో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే పరస్పరం తలపడుతున్నాయఅది కూడా పాకిస్థాన్ జట్టు ఐసీసీ టోర్నీలు ఆడేందుకు భారత్ లో అడుగుపెడుతున్నప్పటికీ, పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ ససేమిరా అంటోంది. ఇప్పుడు పాకిస్థాన్ గడ్డపై నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనేది సందేహాస్పదంగా మారింది.
దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ స్పందించారు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాక్ జట్ల మధ్య టెస్టు సిరీస్ సందర్భంగా పాకిస్థాన్ లోనే ఉన్న థాంప్సన్ మీడియాతో మాట్లాడారు. పాక్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకపోతే అది క్రికెట్ ప్రయోజనాలకే విఘాతం అని అభిప్రాయపడ్డారు.
బీసీసీఐలో కీలకం వ్యవహరించిన జై షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్నారని, ఈ విషయంలో ఆయన కీలకపాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని థాంప్సన్ పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయాలు కాస్తా, క్రికెట్ రాజకీయాలకు దారితీశాయని... ఇప్పుడీ సమస్యకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానని తెలిపారు.
భారత్ లేకుండా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం అనేది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పాకిస్థాన్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేందుకు ఏదో ఒక మార్గం వెతకాల్సిందేనని పేర్కొన్నారు. ప్రస్తుతం చూస్తుంటే రెండు దేశాలు స్నేహపూర్వకంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయని, ఇటీవల అమెరికాలో భారత్, పాక్ జట్లు టీ20 వరల్డ్ కప్ లోనూ తలపడ్డాయని వివరించారు. కాగా, 2008 తర్వాత పాకిస్థాన్ లో భారత్ జట్టు పర్యటించలేదు. ఈసారి చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ వేదికగా నిలుస్తుండగా... ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ జరగనుంది.