Chris Gayle: ఐపీఎల్ వేలం నుంచి క్రిస్ గేల్ అవుట్, తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు షురూ, ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్
Chris Gayle (Photo Credits: IANS)

ఐపీఎల్ అభిమానులకు షాక్. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను (IPL 2022 Auction List) బీసీసీఐ నేడు (మంగళవారం) విడుదల చేసింది. మొత్తం 590 మంది ఆటగాళ్ల పేర్లున్న ఈ జాబితాలో క్రిస్ గేల్ పేరు (Chris Gayle Unavailable For IPL 2022 Auction) ఈసారి మాయమైంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గేల్ ఈసారి వేలం నుంచి తప్పుకోవడం అతడి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అలాగే, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్ పేరు కూడా జాబితాలో కనిపించలేదు.

బెంగళూరులో ఈ నెల 12, 13 తేదీల్లో వేలం జరగనుంది. బీసీసీఐ (BCCI)విడుదల చేసిన జాబితాలో 48 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల బ్రాకెట్‌లో ఉండగా, 20 మంది కనీస ధర రూ. 1.5 కోట్లుగా పేర్కొనగా, 34 మంది ఆటగాళ్లు కోటి రూపాయల బేస్ ప్రైస్ బ్రాకెట్‌లో ఉన్నారు. మొత్తం 590 మందిలో 228 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 355 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు, ఏడుగురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ అతిపెద్ద స్టార్లలో ఒకడైన క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాలుపంచుకోకపోవడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

గేల్ పేరు ఐపీఎల్ వేలం జాబితాలో ( IPL 2022 Auction ) లేకపోవడంతో గతంలో అతడు ప్రాతినిధ్యం వహించిన రెండు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగినట్టు ‘క్రిక్‌బజ్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అతడి పేరును కూడా లిస్ట్‌లో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు పేర్కొంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు యూనివర్స్ బాస్ ఇప్పటికే ప్రకటించాడు.

ఐపీఎల్-15 వేలానికి 590 మంది ఆటగాళ్లు, ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు సన్నాహాలు

ఐపీఎల్‌లో గేల్ ఆరు సెంచరీలు సాధించాడు. ఫలితంగా మెగా టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 142 మ్యాచుల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఏడో అత్యధికం.

మరోవైపు బెన్ స్టోక్స్ కూడా వేలం కోసం ఈసారి తన పేరు నమోదు చేసుకోలేదు. ఈసారి అతడు కౌంటీ క్రికెట్ ఆడనున్నట్టు బ్రిటిష్ మీడియా పేర్కొంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్ వేలికి గాయం కారణంగా సీజన్‌లో చాలా వరకు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వీరిద్దరితోపాటు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా వేలానికి దూరమయ్యాడు. అతడి సహచరులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేలంలో పాల్గొంటున్నారు.

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ కూడా పేరు కూడా జాబితాలో ఉన్నప్పటికీ, అతడు 2023 సీజన్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్ రాసీ వాండెర్ డుసెన్ వేలంలో పాల్గొంటుండగా, ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా పేరు తుది జాబితాలో కనిపించలేదు.