CSK vs RR Stat Highlights: ఇంటి దారికి మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న చెన్నై, ఏడో పరాజయంతో ప్లే ఆఫ్‌ అవకాశాలు ఇక దాదాపు దూరమే, 7 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
Jos Buttler (Photo Credits: Twitter)

ఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్‌ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో (CSK vs RR Stat Highlights IPL 2020) చెన్నై సూపర్‌కింగ్స్‌ చతికిలబడింది. అతి జాగ్రత్తకు పోయిన బ్యాట్స్‌మెన్‌ తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్‌ (Rajasthan Royals) ఆడుతూ పాడుతూ ఛేదించింది. సోమవారం ఇక్కడి షేక్‌ జాయెద్‌ స్టేడియంలో చెన్నైతో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు) మినహా మిగిలినవారు నిరాశ పరిచారు. ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టిన రాజస్థాన్‌ బౌలర్లు చెన్నైని ఒత్తిడిలోకి నెట్టి ఫలితం సాధించారు. ఛేజింగ్‌లో స్మిత్‌ సేన 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో అలరించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. బట్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది.

రెండు సూపర్ ఓవర్లతో సండే బ్లాక్ బాస్టర్ మ్యాచ్, ముంబైపై విజయం సాధించిన పంజాబ్, కింగ్స్ లెవన్‌ను గెలిపించిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. బెన్‌ స్టోక్స్‌ (19; 3 ఫోర్లు) మూడో ఓవర్‌ చివరి బంతికి ఔట్‌ కాగా.. ఊతప్ప (4), శాంసన్‌ (0) అతడిని అనుసరించారు. దీంతో 28 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (26 నాటౌట్‌; 2 ఫోర్లు), బట్లర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా లేకపోవడంతో ఈ జోడీ నిదానంగా ఆడింది. స్మిత్‌ మరీ టెస్టు మ్యాచ్‌ తరహా బ్యాటింగ్‌తో విసిగించగా.. బట్లర్‌ అడపదడపా బౌండ్రీలతో 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు 98 పరుగులు జోడించిన ఈ జంట మరో 15 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది.

పాయింట్ల పట్టిక

  • జట్టు ఆ గె ఓ పా
  • ఢిల్లీ 9 7 2 14
  • ముంబై 9 6 3 12
  • బెంగళూరు 9 6 3 12
  • కోల్‌కతా 9 5 4 10
  • రాజస్థాన్‌ 10 4 6 8
  • హైదరాబాద్‌ 9 3 6 6
  • పంజాబ్‌ 9 3 6 6
  • చెన్నై 10 3 7 6

నోట్‌: ఆ-ఆడినవి, గె-గెలిచినవి, ఓ-ఓడినవి, పా-పాయింట్లు

ఇక టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బ్యట్స్‌మెన్లంతా ఒత్తిడిలో వికెట్లు సమర్పించుకున్నారు. రాజస్థాన్‌ ఫీల్డర్లు చేసిన తప్పిదాలను కూడా ధోనీ సేన సొమ్ముచేసుకోలేకపోయింది. సామ్‌కరన్‌ (22) ఫర్వాలేదనిపించగా.. డుప్లెసిస్‌ (10), వాట్సన్‌ (8), రాయుడు (13) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఫలితంగా 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోనీ (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే పనిలో పడ్డాడు.

రాజస్థాన్‌ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులేస్తుండటంతో.. సింగిల్స్‌కే పరిమితమైన ఈ జోడీ ఐదో వికెట్‌కు 46 బంతుల్లో 51 పరుగులు జోడించింది. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన మహీ.. ఇకనైనా గేర్‌ మార్చుతాడేమో అనుకుంటే అనూహ్యంగా రనౌటయ్యాడు. చివర్లో జడేజా కొన్ని విలువైన పరుగులు జోడించాడు. ఇంకా ఆశ్చర్యకర అంశం ఏమిటంటే ఈ సీజన్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. (చెన్నై సూపర్‌ కింగ్స్‌ 125/5)

స్కోర్‌ బోర్డు

చెన్నై: సామ్‌ కరన్‌ (సి) బట్లర్‌ (బి) గోపాల్‌ 22, డుప్లెసిస్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 10, వాట్సన్‌ (సి) తెవాటియా (బి) త్యాగి 8, రాయుడు (సి) శాంసన్‌ (బి) తెవాటియా 13, ధోనీ (రనౌట్‌) 28, జడేజా (నాటౌట్‌) 35, జాదవ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 125/5. వికెట్ల పతనం: 1-13, 2-26, 3-53, 4-56, 5-107, బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-20-1, రాజ్‌పుత్‌ 1-0-8-0, కార్తీక్‌ త్యాగి 4-0-35-1, స్టోక్స్‌ 3-0-27-0, గోపాల్‌ 4-0-14-1, తెవాటియా 4-0-18-1.

రాజస్థాన్‌: స్టోక్స్‌ (బి) దీపక్‌ 19, ఊతప్ప (సి) ధోనీ (బి) హజిల్‌వుడ్‌ 4, శాంసన్‌ (సి) ధోనీ (బి) దీపక్‌ 0, స్మిత్‌ (నాటౌట్‌) 26, బట్లర్‌ (నాటౌట్‌) 70, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 17.3 ఓవర్లలో 126/3. వికెట్ల పతనం: 1-26-, 2-28, 3-28, బౌలింగ్‌: దీపక్‌ 4-1-18-2, హజిల్‌వుడ్‌ 4-0-19-1, జడేజా 1.3-0-11-0, శార్దుల్‌ 4-0-34-0, సామ్‌ కరన్‌ 1-0-6-0, చావ్లా 3-0-32-0.