చావోరేవో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చేతులేత్తేయడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా (India Lost Match) ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమితో కోహ్లీ సేన (Kohli Team) సెమీస్ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. గ్రూప్-2లో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తయింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 110/7 పరుగులకే పరిమితమైంది.
జడేజా (26 నాటౌట్), హార్దిక్ పాండ్యా (23) మాత్రమే రెండు పదుల స్కోరు దాటారు. ట్రెంట్ బౌల్ట్ (3/20) మూడు వికెట్లు పడగొట్టగా.. ఇష్ సోధీ (2/17) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. శాంట్నర్ (4-0-15-0) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 111/2 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. డారెల్ మిచెల్ (35 బంతుల్లో 49), విలియమ్సన్ (33 నాటౌట్) సత్తాచాటారు. బుమ్రా (2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన ‘బర్త్ డే బాయ్’ ఇష్ సోధి (2/17) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇక ఇంకా మూడు మ్యాచ్‌లున్నా కానీ లీగ్ దశలోనే ఇంటిదారి దాదాపు ఖాయమైంది. భారత్ (India National Cricket Team) సెమీస్ దారులు మూసుపోయాయి. అయితే ఆశలు ఎక్కడో మిణుకు మిణుకుమంటున్నాయి. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా అధికారికంగా భారత జట్టు ఇంకా టోర్నీనుంచి నిష్క్రమించలేదు. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా అంకెల్లో మాత్రం ఇంకా టీమ్‌కు అవకాశముంది! నమీబియా, స్కాట్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లను మన కోణంలో ఏకపక్ష విజయాలుగా భావిస్తే బుధవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే సమరమే కీలకం కానుంది.
టోర్నీలో అఫ్గాన్ ఆడుతున్న తీరు చూస్తే ఆ జట్టు సంచలనానికి కూడా అవకాశముంది. అయితే భారత్ తమ ‘స్థాయి’కి తగ్గ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి... అఫ్గాన్ టీమ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తేనే మన టీమ్ అసలు సమీకరణాల లెక్కలోకి వస్తుంది. అప్పటికీ కూడా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్-2లో నమీబియా జట్టుకంటే కింద భారత్ (-1.609)ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో గెలుపొంది ఆరు పాయింట్లతో గ్రూప్-2లో టాప్‌లో నిలిచింది. నమీబియా, స్కాట్లాండ్‌లతో ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో గెలిస్తే పాకిస్థాన్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది.
ఈ గ్రూప్ నుంచి సెమీస్ కు చేరే రెండో జట్టుపైనే ఒకింత ఉత్కంఠగా ఉంది. అయితే ఆదివారంనాటి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారత్ ఆడిన రెండింటిలో ఘోర పరాజయం చవిచూడడంతో మన రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. భారత్ ఇంకా అఫ్ఘానిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాతో ఆడాలి. ఈ మూడింటిలో మనోళ్లు గెలుపొందుతారనే అనుకుందాం. నెగ్గడమంటే నెగ్గడం కాదు.. భారీ తేడాతో విజయం సాధిస్తేనే మన రన్‌రేట్ మైనస్ నుంచి ప్లస్‌కు చేరుతుంది. అప్పుడు ఆరు పాయింట్ల మన ఖాతాలో ఉంటాయి.
మరోవైపు నమీబియా, స్కాట్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్లతో న్యూజిలాండ్ కూడా తలపడాల్సి ఉంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉన్న కివీస్ నెట్‌రన్‌రేట్ (+0.765) మనకంటే మెరుగ్గా ఉంది. ఇక ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ విజయం సాధిస్తే.. టీమిండియా సెమీస్ అవకాశాలు గల్లంతే. అలా జరగకూడదనుకుంటే.. న్యూజిలాండ్‌ను ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనున్న అఫ్ఘానిస్థాన్ ఓడించాల్సి ఉంటుంది.
అప్పుడు భారత్, న్యూజిలాండ్, అఫ్ఘాన్ తలా ఆరు పాయింట్లతో పట్టికలో సమంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల రెండు వరుస పరాజయాల భారం నుంచి కోలుకొని తదుపరి మూడు మ్యాచ్‌ల్లో భారత్ భారీ రన్ రేట్ తో గెలవాలి. కాగా, రెండు మ్యాచ్‌లు నెగ్గిన అఫ్ఘాన్.. పాక్ చేతిలో ఓడింది. అయితే అఫ్ఘాన్ జట్టు అంత సులువుగా బాబర్ సేనకు లొంగలేదు. ఈ నేపథ్యంలో భారత్, కివీస్‌లకు ఆ జట్టుతో మ్యాచ్‌లు చాలా క్లిష్టంగానే ఉంటాయి. ఏదేమైనా టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయనే చెప్పాలి.