ఐపీఎల్-15వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లీగ్‌లో మొదటి సారి బరిలోకి దిగిన టైటాన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట నెగ్గి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ‘లో స్కోరింగ్’మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ తెవాటియా (16 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, మొహసిన్ ఖాన్, హోల్డర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. దీపక్ హుడా (27) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (8), క్వింటన్ డికాక్ (11), కరణ్ శర్మ (4), కృనాల్ పాండ్యా (5), ఆయుష్ బదోనీ (8), స్టొయినిస్ (2), హోల్డర్ (1) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, సాయికిషోర్, యష్ దయాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్‌తో ఢిల్లీ తలపడనుంది.