ఐపీఎల్ ఫైనల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అడుగు పెట్టింది. లీగ్ దశలో చక్కటి ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్.. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు ( Gujarat Titans Beat Rajasthan Royals) చేసింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన గుజరాత్.. నేరుగా ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (56 బంతుల్లో 89; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (26 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టాడు. దేవదత్ పడిక్కల్ (28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా ఆడగా.. యశస్వి జైస్వాల్ (3), షిమ్రాన్ హెట్‌మైర్ (4), రియాన్ పరాగ్ (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యష్ దయాల్, సాయికిషోర్, హార్దిక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) శుభమన్ గిల్ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, ఒక సిక్సర్), మాథ్యూ వేడ్ (30 బంతుల్లో 35; 6 ఫోర్లు) రాణించగా.. డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. పాండ్యా, మిల్లర్ నాలుగో వికెట్‌కు అజేయంగా 106 పరుగులు జోడించారు.
రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, మెక్‌కాయ్ చెరో వికెట్ పడగొట్టారు. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరుగనున్న ఎలిమినేటర్ పోరులో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీంతో సొంతగడ్డపై సొంత అభిమానుల సమక్షంలో అహ్మదాబాద్‌లో ఈనెల 29న తుది గుజరాత్ తలపడనుంది.