టి20 ప్రపంచకప్ 2021లో (T20 World Cup 2021) టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించడంతో సెమీఫైనల్ అవకాశాలు ఎక్కడో మిణుకు మిణుకు (All possible scenarios) మంటున్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మంచి విజయాన్ని అందుకోవడం ద్వారా టీమిండియా నెట్ రన్‌రేట్‌ను మైనస్ నుంచి ప్లస్‌కు వచ్చింది. అయితే రన్‌రేట్ విషయంలో ఇప్పటికీ న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ల కంటే వెనుకబడి ఉంది. టీమిండియాకు సెమీస్ చేరడం కష్టమే అయినప్పటికీ మొత్తం దారులైతే ( India Semi Final scenario) మూసుకుపోలేదు. చివరి అవకాశాలు మిగిలి ఉన్నాయి అవేంటో చూద్దాం.
గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్, గ్రూప్-2 పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన 3,4 స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించి +0.073 రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ రన్‌రేట్ +.0.816.. అఫ్గానిస్తాన్ రన్‌రేట్ +3.097 నుంచి +1.481 పడిపోయింది. ఇక టీమిండియా సెమీఫైనల్‌కు వెళ్లాలంటే స్కాట్లాండ్, నమీబియాలతో జరగనున్న మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి. అంతేకాదు అఫ్గానిస్తాన్ లేదా నమీబియాతో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఒకవేళ అఫ్గానిస్తాన్ కివీస్ పై గెలిస్తే మాత్రం టీమిండియాకు అవకాశాలు ఉండొచ్చు.
న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్‌తో పాటు నమీబియాపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌కు చేరుతుంది. టీమిండియా, అఫ్గానిస్తాన్‌లు ఇంటిబాట పడతాయి. ఇక న్యూజిలాండ్ అఫ్గానిస్తాన్‌తో ఓడి.. నమీబియాతో గెలిస్తే 6 పాయింట్లు ఉంటాయి. ఇక టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే 6 పాయింట్లు లభిస్తాయి. అదే సమయంలో అఫ్గానిస్తాన్ కూడా ఆరు పాయింట్లతోనే ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఆ పరిస్థితి వస్తే టీమిండియా రన్‌రేట్ మెరుగ్గా ఉంటే మాత్రం కచ్చితంగా సెమీస్‌కు చేరుతుంది.