ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship 2021 Finals) మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. ఇక రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. అయితే, వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ కుదర్లేదు. ఇక మూడో రోజైన ఆదివారం ఆట పూర్తిగా కొనసాగించే పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఎందుకంటే సౌతాంప్టన్ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఈ కారణంగా మూడో రోజు సైతం మ్యాచ్ రోజంతా సజావుగా జరగడం కష్టమేనని బ్రిటీష్ వాతావరణ శాఖ తెలిపిన నివేదికలు చెప్తున్నాయి. అవుట్ ఫీల్డ్ తడిగా కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభమైంది.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (INDIA VS New Zealand) భారత్ క్రమంగా కష్టాల్లో కూరుకుపోతోంది. ఓవర్ నైట్ స్కోరు 146/3తో మూడో రోజు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడు పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. 132 బంతుల్లో ఒక్క ఫోర్ సాయంతో 44 పరుగులు చేసిన కోహ్లీ జెమీసన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ నాలుగు పరుగులు మాత్రమే చేసి జెమీసన్‌కే దొరికిపోయాడు. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు జెమీసన్‌కే దక్కడం గమనార్హం.
ఇక క్రీజులోకి వచ్చిన జడేజా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్ పై ఆశలు రేపిన, రహానే రూపంలో (Ajinkya Rahane Departs for 49) ఆరో వికెట్ కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కాగా రహానే ( 117బంతుల్లో 49, 5*4 ) అర్థ సెంచరీని ఒక్క పరుగు తేడాతో చేజార్చుకున్నాడు. టీమిండియా స్కోరు -182/6 ( 78.4 ఓవర్లలో)