Kolkata, Feb 20: వెస్టిండిస్‌తో (West Indies) లాస్ట్ టీ-20లో కూడా టీమిండియా (India) దుమ్మురేపింది. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విండీస్ ను చిత్తు చేసింది. 17 పరుగుల తేడాతో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు అద్భుతం చేశారు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత్ కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన విండీస్ 167 పరుగులే చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (Nicholas Pooran) హాఫ్ సెంచరీతో రాణించాడు. 47 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో రొమారియో షెపర్డ్ 29 (Romario Shepherd) పరుగులతో (21 బంతుల్లో) పర్వాలేదనిపించాడు. అతడి ఇన్నింగ్స్ లో మూడు సిక్సులు ఉన్నాయి.
.@surya_14kumar is the Man of the Match for his stupendous knock of 65 off 31 deliveries 👏👏@Paytm #INDvWI pic.twitter.com/18huGUyO4X
— BCCI (@BCCI) February 20, 2022
మరో బ్యాటర్ రోవ్ మన్ పావెల్ 14 బంతుల్లో 25 పరుగులు చేశాడు. పావెల్ 2 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో గెలుపుతో టీ20 సిరీస్ ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత జట్టులో యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 65)(Suryakumar Yadav), వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 35 పరుగులు)( Venkatesh Iyer) విండీస్ బౌలింగ్ ను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి ఇన్నింగ్స్ లో 1 ఫోర్, 7 సిక్సులున్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి యాదవ్ ఔటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు, వెంకటేశ్ అయ్యర్ కూడా చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చివరి ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ చెలరేగి ఆడారు. చివరి 6 ఓవర్లకు 91 పరుగులు జోడించి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశారు. డ్రెక్స్ వేసిన 16 ఓవర్‌లో సూర్య కుమార్ ఓ సిక్స్ బాదగా.. వెంకటేశ్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. షెఫర్డ్ వేసిన తర్వాత ఓవర్‌లోనూ 17 పరుగులు వచ్చాయి. డ్రెక్స్ వేసిన 19 ఓవర్‌లో సూర్య సిక్సర్ బాదగా.. వెంకటేశ్ అయ్యర్ మూడు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి మూడు సిక్సర్లు బాదాడు.
అంతకుముందు, ఓపెనర్ ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెపర్డ్, రోస్టన్ చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ తీశారు. ఇప్పటికే రెండు టీ20లు ఓడిన విండీస్.. సిరీస్ ను టీమిండియాకు చేజార్చుకుంది. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్‌కు వరుసగా మూడో సిరీస్ వైట్‌వాష్ కాగా.. విండీస్‌పై రెండోది కావడం విశేషం.