Florida, AUG 07: వెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు. 192 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్.. భారత (India vs West Indies) బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 132 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్(Avesh khan), రవి బిష్ణోయ్ (Ravi bishnoi), అక్షర్ పటేల్ (akshar patel) తలో రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ (191/5) చేసింది. బ్యాటర్ల సమష్టి కృషికి బౌలర్ల మెరుపు బంతులు తోడవడంతో నాలుగో మ్యాచ్‌లో రోహిత్ సేన ఈజీగా విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యఛేదనకు దిగిన విండీస్ ను కట్టుదిట్టమైన బంతులతో భారత్ బౌలర్లు కట్టడి చేశారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు తీశారు. వెస్టిండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ (24), నికోలస్ పూరన్( 24) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 33 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24 పరుగులు) జోడీ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఆ తర్వాత రిషబ్ పంత్ (31 బంతుల్లో 44 పరుగులు), దీపక్ హుడా (19 బంతుల్లో 21 పరుగులు) జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించింది. చివర్లో సంజూ శాంసన్ (23 బంతుల్లో 30 పరుగులు నాటౌట్), అక్షర్ పటేల్ (8 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడడంతో స్కోరు 190 పరుగుల మార్కు దాటింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెక్ కాయ్ తలో రెండు వికెట్లు తీశారు. అకీల్ హోసీన్ 1 వికెట్ తీశాడు.