ఆస్ట్రేలియాతొ జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 70 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో (India vs Australia 2nd Test) గెలిచింది. శుభ్‌మన్ గిల్(35 నాటౌట్), రహానే(27 నాటౌట్) పరుగులతో భారత్‌ను విజయతీరాలకు ( IND Beat AUS by 8 Wickets, Level Series 1-1) చేర్చారు. దీంతో మొదటి టెస్టు పరాజయానికి రహానే సేన ప్రతీకారం తీర్చుకుంది.
అంతకుముందు 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య ఆసీస్ జట్టు 67 పరుగులు సాధించి మిగత నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు.. బూమ్రా, అశ్వీన్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా టార్గెట్‌ను అందుకుంది. రెండో ఇన్సింగ్స్‌లో కూడా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తూ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు.
పుజారా(03) కూడా మరోసారి నిరాశపరిచాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను శుభ్‌మన్ గిల్(35 నాటౌట్), రహానే(27 నాటౌట్) ద్వయం 51 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అలవోక విజయాన్ని అందించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ రెండు జట్ల చెరో విజయంతో 1-1 సమం అయింది. మూడో టెస్టు జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది.