India vs Australia semi-final

చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఐసీసీ టోర్నీలలో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు అదే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోనూ టీమిండియాను ఓడించింది.

అయితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీ ఫైన‌ల్స్‌లో టీమిండియా అద్భుత‌మైన రికార్డు క‌లిగి ఉంది. గ‌త 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జ‌రిగిన సెమీస్‌లో భార‌త జ‌ట్టుకు ఓట‌మి అనేదే లేదు. సెమీ ఫైన‌ల్స్‌కు వెళ్లిన ప్ర‌తీసారి గెలిచి స‌గ‌ర్వంగా ఫైన‌ల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైన‌ళ్ల‌లో విజ‌యాలు న‌మోదు చేసి త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌ర‌గబోయే సెమీఫైన‌ల్లోనూ అదే రిపీట్ చేయాల‌ని భార‌త‌ అభిమానులు కోరుకుంటున్నారు.

సెమీఫైనల్స్ వివరాలు ఇవిగో, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్,ఫైనల్ మ్యాచ్ మార్చి 9న..

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జ‌ట్టు తలపడనుంది. భార‌త్‌ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇది ఆరోసారి. ఇంతకుముందు ఐదుసార్లు సెమీస్ ఆడిన టీమిండియా నాలుగు సార్లు విజేత‌గా నిలిచింది. 1998లో ఒక‌సారి మాత్రం వెస్టిండీస్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది.

చివరిసారిగా 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడింది. బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ త‌ర్వాత‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడింది. కానీ, ఫైన‌ల్లో టీమిండియాకు భంగ‌పాటు ఎదురైంది. దాంతో మూడో టైటిల్ చేజారింది. కాగా, మెన్ ఇన్ బ్లూ 2002, 2013 ఎడిషన్లలో విజేతగా నిలిచిన విష‌యం తెలిసిందే.

అయితే ఆస్ట్రేలియా రూపంలో ప్రమాదం పొంచి ఉండటంతో టీమిండియా దాన్ని దాటాలి. గత పరాజయాలకు కసి తీర్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో ఫేవరేట్‌గా భారత్‌ బరిలోకి దిగుతున్నా ఐసీసీ టోర్నీలలో మనపై ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న దుబాయ్‌ పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్ల జోరుకు భారత స్పిన్‌ మాంత్రికుల మాయాజాలానికి రసవత్తర పోరు జరగడం ఖాయంలా కనిపిస్తోంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్స్‌లో భారత్‌ ఫలితాలు ఇలా..

వెస్టిండీస్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి (1998; ఢాకా)

దక్షిణాఫ్రికాపై 95 పరుగుల తేడాతో విజయం (2000; నైరోబి)

దక్షిణాఫ్రికాపై 10 పరుగుల తేడాతో విజయం (2002; కొలంబో)

శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం (2013; కార్డిఫ్)

బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం (2017; బర్మింగ్ హామ్)