పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చతికిలపడింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బంగ్లాను 257 పరుగుల టార్గెట్ ను భారత్.. లక్ష్యాన్ని 41.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)కి శతకానికి తోడు శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (40 బంతుల్లో 48, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో కెఎల్ రాహుల్ (34 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 1సిక్సర్) రాణించడంతో భారత్ ఈజీ విక్టరీ కొట్టింది. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు నాలుగో విజయం కాగా బంగ్లాదేశ్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడో ఓటమి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. తంజిద్ హసన్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా తంజిద్ హసన్ దూకుడుగా ఆడాడు. 43 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. లిట్టన్ దాస్ 82 బాల్స్‌లో 7 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు. దీంతో ఒక దశలో బంగ్లాదేశ్ 93/0 స్కోరుతో కనిపించింది. అయితే వీళ్ల భాగస్వామ్యాన్ని కుల్‌దీప్ విడదీశాడు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది.
చివర్లో సీనియర్ ఆటగాళ్లు ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా ఎడాపెడా బౌండరీలు బాదడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముష్పీకర్ 46 బంతుల్లో 38, మహ్మదుల్లా 36 బంతుల్లో 46 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రాణించారు. వీళ్లంతా తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు.
257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 88 పరుగులు జోడించారు. ఈ ఇరువురూ కలిసి తొలి పవర్ ప్లేలోనే భారత్‌ను విజయం దిశగా నడిపించారు. రోహిత్ తృటిలో అర్థ సెంచరీ కోల్పోయినా 52 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డే ప్రపంచకప్‌లో గిల్‌కు ఇదే తొలి అర్థ సెంచరీ కావడం విశేషం.
రోహిత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అదే దూకుడును కొనసాగించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లోనే 4, 6 బాది తన ఉద్దేశాన్ని చాటిన కోహ్లీ.. 48 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (25 బంతుల్లో 19, 2 ఫోర్లు)ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయాస్‌ను మెహిది హసన్ మిరాజ్ ఔట్ చేశాడు.
అయ్యర్ నిష్క్రమించినా కెఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ భారత్‌ను విజయం దిశగా నడిపించాడు. చివర్లో భారత్ విజయం కంటే కూడా కోహ్లీ శతకం చేస్తాడా..? లేదా..? అన్న ఆందోళన భారత అభిమానులను వేధించింది. ఒకవైపు కెఎల్ రాహుల్ మ్యాచ్‌ను ముగించేందుకు ధాటిగా ఆడటంతో ఆ ఆందోళన మరింత ఎక్కువైంది. కానీ ఒక్కో పరుగు కూడబెడుతూ 90లలోకి వచ్చిన కోహ్లీ.. నసుమ్ వేసిన 42వ ఓవర్ మూడో బంతికి సిక్సర్‌బాది సెంచరీ చేయడమే గాక భారత విజయాన్ని ఖాయం చేశాడు.