ఐపీఎల్-13వ సీజన్ ప్రారంభమైంది. కరోనా సంక్షోభం కారణంగా ఎటువంటి ఆరంభ వేడుకలు లేకుండానే ఈ క్యాష్ రిచ్ లీగ్ నిశ్శబ్దంగా మనముందుకు వచ్చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (IPL 2020 CSK vs MI) చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2020 మొదలైంది. 2008లో సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై పేరు తెచ్చుకున్నాయి.
ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే (Chennai Super Kings) ఖాతాలో మూడు టైటిళ్లున్నాయి. అలాగే ఆడిన పది సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరిందంటే సీఎస్‌కే నిలకడ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడం, రైనా.. హర్భజన్ దూరం కావడం వారిని ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితులను మహీ ఎలా అధిగమిస్తాడన్నది ఆసక్తికరమే. ఇక నాలుగు టైటిళ్లతో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. రోహిత్ శర్మ నేతృత్వం.. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడం వారికి కలిసి రానుంది.
గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రన్నరప్ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం. చెన్నైతో ముఖాముఖి రికార్డులో రోహిత్ శర్మ బృందం 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ధోని దళం 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఇప్పుడిదే ఆ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. ఐపీఎల్ -2020 సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ ముంబైను తొలి మ్యాచ్(ముంబై తలపడిన తొలి మ్యాచ్)లో ఓటమి గత ఏడు సీజన్ల నుంచి వేధిస్తోంది. గత ఏడు సీజన్లుగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా ముంబై తమ తొలి మ్యాచ్‌ను 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గింది. ఐదేళ్ల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కానీ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టలేదు.