IPL 2021: ఆ ఒక్క ప్లే అప్ బెర్త్ ఎవరిది, రేసులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌.. ఒక్క మ్యాచ్ గెలిస్తే మిగతా మూడు ఇంటికే, ప్లేఆఫ్స్ బెర్త్‌ కోసం తలపడే నాలుగు టీంల పాయింట్లు ఏంటో ఓ సారి చూద్దాం
IPL Logo (Photo Credits: IANS)

మ‌రో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2021 ( IPL 2021 ) సీజ‌న్ ముగుస్తోంది. ఇప్ప‌టికే మూడు టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌టి టీమ్ కాగా.. ఆ త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం పంజాబ్‌పై గెలిచిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా ముంద‌డుగు వేసింది. ఇక ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్లే ఆఫ్ బెర్త్‌ (One berth, four contenders). దీనికోసం నాలుగు టీమ్స్ పోటీ ప‌డుతున్నాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో పాటు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్‌ కింగ్స్, రాజస్థాన్ రాయ‌ల్స్ రేసులో ఉన్నాయి. అన్ని టీంలు కేవలం 4 పాయింట్ల దూరంలో (All playoffs possibilities in 4 points) ఉన్నాయి. స‌న్‌రైజ‌ర్స్ ఇప్ప‌టికే ఇంటిదారి ప‌ట్టింది. ఓ సారి టీంలను పరిశీలిస్తే..

ఆదివారం స‌న్‌రైజ‌ర్స్‌పై గెలిచిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ప్ర‌స్తుతానికి మిగ‌తా మూడు టీమ్స్ కంటే 2 పాయింట్లు ఎక్కువగానే ఉన్నాయి. మ‌రొక్క మ్యాచ్ మాత్ర‌మే మిగిలి ఉంది. చివ‌రి మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌పై గెలిస్తే కోల్‌క‌తా పాయింట్ల సంఖ్య 14కు చేరుతుంది. అయితే వాళ్ల నెట్‌ర‌న్‌రేట్ పాజిటివ్‌గా ఉండ‌టం కోల్‌క‌తాకు ప్ల‌స్ పాయింట్‌. చివ‌రి మ్యాచ్‌లో ఓడితే మాత్రం కోల్‌క‌తా ప్లేఆఫ్స్ ఆశ‌లు గ‌ల్లంతైన‌ట్లే చెప్పాలి.రాజ‌స్థాన్‌పై కోల్‌క‌తా గెలిస్తే మిగ‌తా అన్ని టీమ్స్ ఇంటికెళ్లిపోతాయి.

ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోహ్లీ సేన, పంజాబ్‌ జట్టుపై 6 పరుగుల తేడాతో ఘన విజయం

పంజాబ్ కింగ్స్‌కు చివరి మ్యాచ్ మాత్ర‌మే మిగిలి ఉంది. ప‌ది పాయింట్ల‌తో ఉన్న ఆ టీమ్‌.. చివ‌రి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచినా 12కు చేరుకుంటుంది. ఒక‌వేళ ఆ మ్యాచ్ గెలిచినా అదే రోజు (అక్టోబ‌ర్ 7) సాయంత్రం కోల్‌క‌తా, రాజ‌స్థాన్ మ్యాచ్ ఉంది. అందులో కోల్‌క‌తా గెలిస్తే పంజాబ్ ప‌నైపోయిన‌ట్లే.

రాజ‌స్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ముంబై, కోల్‌క‌తాల‌తో ఆడాల్సి ఉంది. ముంబైపై గెలిస్తే ఆ టీమ్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉంటాయి. అదే స‌మ‌యంలో ముంబై ఆశ‌లు గ‌ల్లంత‌వుతాయి. అయితే ఆ త‌ర్వాత కోల్‌క‌తాపై కూడా గెలిస్తేనే రాజ‌స్థాన్ ప్లేఆఫ్స్‌పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చు. రెండు మ్యాచ్‌లూ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌. లేదంటే ఇత‌ర టీమ్స్ జ‌యాప‌జ‌యాలు, నెట్‌ర‌న్‌రేట్ల‌తో పోటీ ప‌డాల్సి ఉంటుంది.

డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్ కు మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఆ టీమ్ ప్ర‌స్తుతానికి మూడు టీమ్స్‌తో స‌మంగా ఉంది. చివ‌రి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌తో త‌ల‌ప‌డాల్సి ఉన్నా.. అంత‌కంటే ముందు వాళ్లు రాజ‌స్థాన్ గండాన్ని గ‌ట్టెక్కాల్సి ఉంది. రాజ‌స్థాన్ కూడా ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకుంది కాబ‌ట్టి ముంబైకి అది అంత సులువు కాదు. రెండింట్లోనూ గెలిస్తే ముంబై 14 పాయింట్ల‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ కోల్‌క‌తా చివ‌రి మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌పై గెలిస్తే.. వాళ్ల‌కూ 14 పాయింట్లే ఉంటాయి. అప్పుడు నెట్‌ర‌న్‌రేట్ కీల‌కం అవుతుంది. అలా అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ముంబై క్వాలిఫై అయ్యే చాన్సెస్ త‌క్కువే. రెండు మ్యాచ్‌ల‌లోనూ భారీ విజ‌యాలు సాధిస్తేనే ముంబై నెట్ ర‌న్‌రేట్ మెరుగ‌వుతుంది.

తాజా సీజన్‌లో టాప్‌-2గా కొనసాగుతున్న ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య నిన్న మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ముగిసింది. 137 పరుగుల ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడినా హెట్‌మయెర్‌ (18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్‌) రాణింపుతో మరో 2 బంతులుండగా 3 వికెట్లతో నెగ్గింది. దీంతో 20 పాయింట్లతో ఢిల్లీ.. 18 పాయింట్లతో చెన్నై తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీఎస్‌కేకు ఇది వరుసగా రెండో ఓటమి. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. రాయుడు (55 నాటౌట్‌) అర్ధసెంచరీతో రాణించాడు. అక్షర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. ధవన్‌ (39) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజా, శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్షర్‌ పటేల్‌ నిలిచాడు.