ఐపీఎల్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో అనూహ్య రీతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ( Mumbai Indians captain Rohit Sharma) ఫైన్ వేశారు. స్లో ఓవర్ రేటు కారణంగా అతడికి 12 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ముంబై సారథికి ఈ మేర ఫైన్ పడింది. ఈ మేరకు ‘‘ఇది జట్టు మొదటి తప్పిదమైన కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌కు 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ తమ ప్రకటనలో పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ గత మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు సారథికి రూ. 12 లక్షలు, అదే తప్పు మరోసారి చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెడతారు. మూడోసారి కూడా అదే జరిగినట్లయితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.