స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి విదితమే. జనవరి 3న ముంబై వేదికగా లంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్‌ను ఈ సిరీస్‌కు భారత వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా నిలిచి సత్తా చాటిన ఈ ముంబై బ్యాటర్.. శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు సారథ్యం వహించనున్నాడు. దీనిపై సూర్యకుమార్ స్పందించారు. అస్సలు ఊహించలేదు. మెసేజ్ చూడగానే.. ఒక్క క్షణం కళ్లు మూసుకున్నా! ఇది కలైతే కాదు కదా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఏదేమైనా అదో గొప్ప అనుభూతి. ఈ ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేను’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
సెలవు పెట్టిన కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడన్న వార్తల నేపథ్యంలో.. సూర్యకి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ లభించడం గమనార్హం. ఈ క్రమంలో హార్దిక్‌కు అతడు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించిన సూర్య ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2022- 23లో భాగంగా ముంబై తరఫున ఆడుతున్నాడు.
మా నాన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. లంక సిరీస్ లిస్టు చూడగానే ఆయన నాకు మెసేజ్ పంపారు. ఒత్తిడి వద్దు.. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తూ ఉంటావు కదా! దానిని ఆస్వాదించు అని చెప్పారు.నేనైతే కలగనడం లేదు కదా అని ఒక్కసారి గిల్లి చూసుకున్నా! ఈ ఏడాది నా ప్రదర్శనకు దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నా. కొత్త హోదాలో మైదానంలో దిగేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఒత్తిడిని అధిగమించి ఆటను పూర్తిగా ఆస్వాదించడమే నాకు తెలుసు’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.