ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు వరుసగా 8 ఓటములతో చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. ఐదుసార్లు టైటిల్ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో (IPL 2022) గెలుపు కోసం నానా తంటాలు పడుతోంది. సీజన్‌లో ముంబైతో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపిస్తే.. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా కీలక వికెట్లు పడగొట్టి లక్నోకు ఐదో విజయాన్ని (Lucknow’s Win Over Mumbai Indians) కట్టబెట్టాడు!
ఆదివారం జరిగిన పోరులో లక్నో సూపర్‌జెయింట్స్ చేతిలో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 103; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) సీజన్‌లో రెండో శతకంతో అదరగొట్టగా.. మిగిలినవాళ్ల నుంచి సారథికి సరైన సహకారం లభించలేదు. రాహుల్ ఒంటరి పోరాటం చేయగా.. డికాక్ (10), స్టొయినిస్ (0), కృనాల్ పాండ్యా (1), దీపక్ హుడా (10), ఆయుశ్ బదోనీ (14) విఫలమయ్యారు. మనీశ్ పాండే (22) కాసేపు రాహుల్‌కు అండగా నిలిచాడు.
ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, ఒక సిక్సర్), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓ మోస్తరు లక్ష్యఛేదనలో రోహిత్ నిలకడ కనబర్చడంతో ఒక దశలో 49/0తో మెరుగైన దశలో నిలిచిన ముంబై.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (8), బ్రేవిస్ (3), సూర్యకుమార్ (7) ఘోరంగా విఫలమయ్యారు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం పంజాబ్‌తో చెన్నై తలపడనుంది.