పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించి భారీ విషయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా(Namibia) 53 పరుగుల భారీ తేడాతో చిత్తు అయింది. టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లో (T20 World Cup 2021) టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిల్యాండ్‌కు మార్టిన్ గప్తిల్ (18), డారియల్ మిచెల్ (19) మంచి ఆరంభమే అందించారు. ఓపెనర్లు అవుటైన మరో వికెట్ పడకుండా కేన్ విలియమ్సన్ (28), డెవాన్ కాన్వే (17) జట్టును ఆదుకున్నారు. అయితే చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (21 బంతుల్లో 39 నాటౌట్), జేమ్స్ నీషమ్ (23 బంతుల్లో 35) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్ జట్టు 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో (New Zealand vs Namibia) నమీబియాకు ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వ్యాన్ లింగెన్ (25) నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే ఆ తర్వాత కెప్టెన్ ఎరాస్మస్ (3), జేన్ గ్రీన్ (23), డేవిడ్ వీజే (16), లాఫ్టీ ఈటన్ (0), క్రెగ్ విలియమ్స్ (0), జేజే స్మిత్ (9 నాటౌట్), రూబెన్ ట్రంపెల్‌మన్ (6 నాటౌట్) ఎవరూ బ్యాటు ఝుళిపించలేకపోయారు. నమీబియాకు ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21), మైకేల్ వ్యాన్ లింగెన్ (25) నిలకడైన ఆరంభాన్నిచ్చిని దాన్ని తరువాత ప్లేయర్లు సద్వినియోగం చేసుకోలేక పోయారు.
చివరకు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 111/7తో విజయానికి 53 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివర్లో 18వ ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో గ్రీన్ అవుటవగా.. 19వ ఓవర్లో లాఫ్టీ ఈటన్, క్రెగ్ విలియమ్స్‌ను పెవిలియన్ చేర్చిన బౌల్ట్ దెబ్బకు నమీబియా చేతులెత్తేసింది. అప్పటి వరకూ ఏమైనా పోరాడే అవకాశం ఉన్నా ఒకేసారి ఇద్దరు కివీ పేసర్లు విజృంభించడంతో నమీబియా కుప్పకూలింది.
ఈ విజయంతో న్యూజిల్యాండ్ సెమీస్ ఆశలు మరింత పెరగ్గా.. భారత జట్టు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాలి. దానికి తోడు ఆఫ్ఘనిస్థాన్‌తో నవంబరు 7న జరిగే మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చిత్తుగా ఓడాలి.