సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో అత్యవసర విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో సోమవారం ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. 13 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో పట్టికలో నాలుగో స్థానానికి చేరగా.. పంజాబ్ నామమాత్రంగా మాత్రమే రేసులో మిగిలింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 142 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో జితేష్ శర్మ(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ ,కుల్ధీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, నోర్జే ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్‌స్టోన్, ఆర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్ సాధించాడు.