Glenn Maxwell, Virat Kohli. Image Credits: BCCI

ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయంతో రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్సీబీ) బెంగళూరు శిబిరంలో ఆనందం ఆకాశాన్ని తాకింది. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందడంతో డ్రెస్సింగ్‌ రూంలో ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఓపెనర్‌ విరాట్‌ (Glenn Maxwell And Virat Kohli )ఆటపట్టించాడు. రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్‌ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. చాలా అంటే చాలా వేగంగా పరిగెత్తుతావు (Can't Bat With You, You Run Too Fast). ఒకటి, రెండు పరుగులు సాధిస్తావు... కానీ నేను అలా కాదు’’ అని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే, కోహ్లి మాత్రం తనకేమీ పట్టనట్లు.. ‘ఏంట్రా బాబూ ఇది’’ అన్నట్లు ముఖం పెట్టి బ్యాట్‌ సర్దిపెట్టుకున్నాడు.

కాగా ఆర్సీబీ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సింగిల్‌కు పెద్దగా అవకాశం లేనప్పటికీ కోహ్లి పరుగుకు యత్నించాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న మాక్సీ.. కోహ్లికి బదులిచ్చే క్రమంలో క్రీజును వీడాడు. అయితే, అప్పటికే బంతిని అందుకున్న రాబిన్‌ ఊతప్ప.. వికెట్‌ కీపర్‌ ధోనికి త్రో వేశాడు. దీంతో వెంటనే ధోని వికెట్లను గిరాటేయడంతో మాక్సీ(3) రనౌట్‌గా వెనుదిరిగాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు, సమిష్టి ప్రదర్శనతో నాలుగో స్థానానికి ఎగబాకిన ఆర్‌సీబీ, 13 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం

ఇదిలా ఉండగా కోహ్లి ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి విజయంలో తన వంతు ప్రాత పోషించాడు. ఈ నేపథ్యంలో మాక్సీ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.