ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అద్భుతం చేసింది. ఫామ్ కోల్పోయాడనే విమర్శలకు బ్యాట్‌తో బదులిస్తూ విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను కైవసం చేసుకున్న బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.
తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు 168/5 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకంతో మెరవగా.. డేవిడ్ మిల్లర్ (34), ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (31) రాణించారు. రషీద్ ఖాన్ (19 నాటౌట్) మరోసారి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు తరఫున హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లకు 170/2 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్‌గా వచ్చిన మాజీ కెప్టెన్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కెప్టెన్ డుప్లెసిస్ (44) రాణించగా.. మాక్స్‌వెల్ (40 నాటౌట్) జట్టును గెలుపు బాట పట్టించాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది అవార్డు’ లభించింది.
ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరినట్లే. ఏది ఏమైనా కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావడం మాత్రం బెంగళూరు అభిమానులను సంతోషంలో ముంచేసింది.