RCB vs KKR Highlights: కోహ్లీ సేనను ఇంటికి సాగనంపిన నరైన్, బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం, ఫైనల్ బెర్తు కోసం ఢిల్లీతో తలపడనున్న మోర్గాన్‌ సేన
RCB skipper Virat Kohli shakes hands with KKR counterpart Eoin Morgan after the match (Photo credit: Twitter)

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. విరాట్‌ కోహ్లీ చివరి కెప్టెన్సీలోనూ ఈ జట్టు రాత మారలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో చూపిన జోరును అత్యంత కీలకమైన మ్యాచ్‌లో (RCB vs KKR Highlights) పునరావృతం చేయలేకపోయింది. తన స్పిన్‌ మాయాజాలంతో బెంగళూరును కట్టిపడేసిన సునీల్‌ నరైన్‌ తర్వాత భారీ సిక్సర్లతో మ్యాచ్‌పై ప్రత్యర్థి పట్టు తప్పించాడు.

ఆర్‌సీబీ ప్రధాన బ్యాటర్స్‌ భరత్‌, కోహ్లీ, డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌ వికెట్లను తీసిన నరైన్‌.. బ్యాటింగ్‌లోనూ చేసిన పరుగులే కీలకమయ్యాయి. దీంతో సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి క్వాలిఫయర్‌–2కు అర్హత (Kolkata Knight Riders Script Thrilling Win) సాధించింది. బుధవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీతో మోర్గాన్‌ సేన తలపడుతుంది. గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్లో తలపడుతుంది.

టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 39; 5 ఫోర్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు) తర్వాత నరైన్‌ (4/21) మాయాజాలానికి ఇంకెవరూ 15 పరుగులను కూడా దాటలేకపోయారు. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. నరైన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

టీ20 వరల్డ్‌కప్ 2021 విన్నర్‌కు రూ.12.02 కోట్లు, ర‌న్న‌ర‌ప్‌కు రూ.6 కోట్లు, లీగ్ మ్యాచ్ గెలిచే టీమ్‌కు రూ.30 లక్షలు, ప్రైజ్‌మ‌నీని ప్రకటించిన ఐసీసీ

భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాలనే ఆలోచనతో టాస్‌ గెలవగానే ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆరంభంలో ఓపెనర్లు కోహ్లీ, దేవ్‌దత్‌ చకచకా పరుగులు సాధించారు. రెండో ఓవర్‌లో కోహ్లీ, నాలుగో ఓవర్‌లో దేవ్‌దత్‌ రెండేసి ఫోర్లు బాదారు. ఆ తర్వాత దేవ్‌దత్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేసినా పవర్‌ప్లేలో జట్టు 53 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఆర్‌సీబీ ఆట పూర్తిగా నెమ్మదించింది.

కోహ్లీ, భరత్‌ క్రీజులో ఉన్నా 6 నుంచి 10 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా నమోదు కాలేదు. అటు స్పిన్నర్‌ నరైన్‌ వరుస ఓవర్లలో భరత్‌ (9), విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్‌ (11), మ్యాక్స్‌వెల్‌ (15)ను అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీ షాక్‌లో మునిగింది. ఇందులో విరాట్‌, ఏబీని నరైన్‌ బోల్తా కొట్టిస్తూ కళ్లు చెదిరే బంతులతో బౌల్డ్‌ చేయడం అబ్బురపరిచింది. అటు టెయిలెండర్ల నుంచి కూడా నామమాత్ర ప్రదర్శన రావడంతో చివరి 5 ఓవర్లలో బెంగళూరు 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.

స్వల్ప ఛేదనలో కోల్‌కతా ఆఖరి ఓవర్‌ వరకు ఆడాల్సి వచ్చింది. ఆరంభ ఓవర్లలో కోల్‌కతా ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌ (26) ధాటిగా ఆడారు. గార్టన్‌ నాలుగో ఓవర్లో గిల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో అలరించాడు. కానీ అతని దూకుడుకు ఆరో ఓవర్లో హర్షల్‌ పటేల్‌ కళ్లెం వేశాడు. రాహుల్‌ త్రిపాఠి (6)ని చహల్‌ బోల్తాకొట్టించాడు. మరోవైపు అయ్యర్‌ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లలో కోల్‌కతా 2 వికెట్లకు 74 పరుగులు చేసింది. అయ్యర్‌ ఔటయ్యాక మ్యాచ్‌లో పట్టు సాధించాలనుకున్న కోహ్లికి నరైన్‌ మళ్లీ కొరకరానికొయ్యగా మారాడు.

క్రిస్టియాన్‌ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు రాబట్టుకోవడంతోనే బెంగళూరు ఆశలు ఆవిరయ్యాయి. ఆఖరి 18 బంతుల్లో 15 పరుగుల విజయ సమీకరణం కోల్‌కతాను సులువుగా ఊరిస్తుండగా... 18వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ ఆశలు రేపాడు. 3 పరుగులే ఇచ్చి నరైన్, దినేశ్‌ కార్తీక్‌ (10)లను ఔట్‌ చేశాడు. 19వ ఓవర్లో గార్టన్‌ 5 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా 7 పరుగులు చేయాల్సిన దశలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ క్రిస్టియాన్‌ తొలి బంతికే షకీబ్‌ బౌండరీ బాదడం... ఆ తర్వాత మూడు బంతులకు మూడు సింగిల్స్‌ రావడంతో కోల్‌కతా మరో 2 బంతులుండగానే విజయం సాధించింది.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (బి) ఫెర్గూసన్‌ 21; కోహ్లి (బి) నరైన్‌ 39; భరత్‌ (సి) వెంకటేశ్‌ (బి) నరైన్‌ 9; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నరైన్‌ 15; డివిలియర్స్‌ (బి) నరైన్‌ 11; షహబాజ్‌ (సి) శివమ్‌ మావి (బి) ఫెర్గూసన్‌ 13; క్రిస్టియాన్‌ (రనౌట్‌) 9; హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 8; గార్టన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 138.

వికెట్ల పతనం: 1–49, 2–69, 3–88, 4–102, 5–112, 6–126, 7–134.

బౌలింగ్‌: షకీబ్‌ 4–0–24–0, శివమ్‌ మావి 4–0–36–0, వరుణ్‌ 4–0–20–0, ఫెర్గూసన్‌ 4–0–30–2, నరైన్‌ 4–0–21–4.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 29; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) భరత్‌ (బి) హర్షల్‌ 26; రాహుల్‌ త్రిపాఠి (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్‌ 6; రాణా (సి) డివిలియర్స్‌ (బి) చహల్‌ 23; నరైన్‌ (బి) సిరాజ్‌ 26; దినేశ్‌ కార్తీక్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 10; మోర్గాన్‌ (నాటౌట్‌) 5; షకీబ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 139.

వికెట్ల పతనం: 1–41, 2–53, 3–79, 4–110, 5–125, 6–126.

బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–19–2, గార్టన్‌ 3–0–29–0, హర్షల్‌ 4–0–19–2, చహల్‌ 4–0–16–2, మ్యాక్స్‌వెల్‌ 3–0–25–0, క్రిస్టియాన్‌ 1.4–0–29–0.