Rohit Sharma shares update on Rishabh Pant's injury

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ అత్య‌ధికంగా 20 ప‌రుగులు చేయ‌గా, అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గ‌డ్డ‌పై భార‌త్ జ‌ట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. టెస్టుల్లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఇండియా నిష్క్ర‌మించ‌డం ఇది మూడ‌వ‌సారి.

వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్‌‌ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు

కివీస్‌ మొదిటి ఇన్నింగ్స్‌ సమయంలో పంత్‌కు గాయమైంది. 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన బంతిని కివీస్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బాల్‌ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వచ్చి పంత్‌ మెకాలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. అతడి స్థానాన్ని ధ్రువ్‌ జురెల్‌ భర్తీ చేశాడు. నిజానికి.. ఈ మ్యాచ్‌కు పంత్‌ మళ్లీ అందుబాటులోకి రావడం అత్యంత ముఖ్యం. బ్యాటర్‌గా, కీపర్‌గా అతడి సేవలు జట్టుకు అవసరం.

అతడు గాయం వల్ల దూరమైతే పరిస్థితి ఏమిటన్న అభిమానుల ఆందోళన నేపథ్యంలో రోహిత్‌ శర్మ స్పందించాడు. గురువారం ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ సరిగ్గా మోకాలికే బంతి తగలింది.అదే కాలికి గతంలో సర్జరీ జరిగింది. అందుకే.. మోకాలు కాస్త వాపు వచ్చింది. కండరాలు కూడా పట్టేశాయి. అందుకే మేము రిస్క్‌ తీసుకోదలచుకోలేదు. రిషభ్‌ కూడా మాకు ఇదే చెప్పాడు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా అతడిని వెనక్కి పంపించాం.

సర్జరీ జరిగిన కాలుకే గాయం కావడంతో ఈ నిర్ణం తీసుకున్నాం. అతడు తొందరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. రేపు(శుక్రవారం) తనని మనం మైదానంలో చూస్తామనే అనుకుంటున్నాం’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న ఈ ఉత్తరాఖండ్‌ క్రికెటర్‌.. దాదాపు ఏడాదిన్నర తర్వాత పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అనంతరం టీ20 ప్రపంచకప్‌-2024లో పాల్గొని టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు.