AB de Villiers. (Photo Credits: Twitter)

గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో సిక్సర్లతో తన మార్క్‌ విధ్వంసం సృష్టించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును (Royal Challengers Bangalore) ఏబీ డివిలియర్స్‌ విజేతగా నిలిపాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లతో ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో (RR vs RCB Stat Highlights IPL 2020) ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌కు కోహ్లీసేన దగ్గరైతే... ఇందుకు భిన్నంగా ఆరో ఓటమితో రాయల్స్‌ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. శనివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (36 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (22 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడు కనబరిచాడు. మోరిస్‌ 4 వికెట్లతో రాయల్స్‌ను కట్టడి చేయగా... చహల్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డివిలియర్స్‌ (22 బంతుల్లో 55 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. దేవదత్‌ పడిక్కల్‌ (35; 2 ఫోర్లు), కెప్టెన్‌ కోహ్లి (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు), గురుకీరత్‌ సింగ్‌ (17 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్‌) ఆకట్టుకున్నారు.

ప్లేఅఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న చెన్నై, 5 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం, అజేయ శతకంతో చెలరేగిన శిఖర్‌ ధవన్‌, మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

బెంగళూరు లక్ష్య ఛేదనలో డివిల్లీర్స్‌ ఆటే హైలైట్‌ గా నిలిచింది. 14 ఓవర్లలో జట్టు స్కోరు 102/3తో కష్టాల్లో ఉన్న దశలో డివిల్లీర్స్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరమవగా.. ఉనాద్కట్‌ వేసిన 19వ ఓవర్‌లో డివిల్లీర్స్‌ మూడు వరుస సిక్స్‌లతో 25 రన్స్‌ పిండుకోవడంతో.. సమీకరణలు మారిపోయాయి. ఓపెనర్‌ ఫించ్‌ (14) స్వల్ప స్కోరుకే అవుటైనా.. కోహ్లీ, మరో ఓపెనర్‌ పడిక్కళ్‌ రెండో వికెట్‌కు 79 పరుగులతో ఆదుకున్నారు. అయితే, పడిక్కళ్‌ను తెవాటియా.. కోహ్లీని త్యాగి వెంటవెంటనే అవుట్‌ చేయడంతో చాలెంజర్స్‌ ఇబ్బందుల్లో పడింది. కానీ, గుర్‌కీరత్‌ (19 నాటౌట్‌)తో కలసి డివిల్లీర్స్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు గీత దాటించాడు.

స్కోరు వివరాలు

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) ఫించ్‌ (బి) చహల్‌ 41; స్టోక్స్‌ (సి) డివిలియర్స్‌ (బి) మోరిస్‌ 15; సామ్సన్‌ (సి) మోరిస్‌ (బి) చహల్‌ 9; స్మిత్‌ (సి) షాబాజ్‌ అహ్మద్‌ (బి) మోరిస్‌ 57; బట్లర్‌ (సి) సైనీ (బి) మోరిస్‌ 24; రాహుల్‌ తేవటియా (నాటౌట్‌) 19; ఆర్చర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మోరిస్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.

వికెట్ల పతనం: 1–50, 2–69, 3–69, 4–127, 5–173, 6–177.

బౌలింగ్‌: సుందర్‌ 3–0–25–0, మోరిస్‌ 4–0–26–4, ఉదాన 3–0–43–0, సైనీ 4–0–30–0, చహల్‌ 4–0–34–2, షాబాజ్‌ అహ్మద్‌ 2–0–18–0.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవదత్‌ పడిక్కల్‌ (సి) స్టోక్స్‌ (బి) తేవటియా 35; ఫించ్‌ (సి) ఉతప్ప (బి) శ్రేయస్‌ గోపాల్‌ 14; కోహ్లి (సి) తేవటియా (బి) కార్తీక్‌ త్యాగి 43; డివిలియర్స్‌ (నాటౌట్‌) 55; గురుకీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 179.

వికెట్ల పతనం: 1–23, 2–102, 3–102.

బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4–0–38–0, గోపాల్‌ 4–0–32–1, కార్తీక్‌ త్యాగి 4–0–32–1, ఉనాద్కట్‌ 4–0–46–0, రాహుల్‌ తేవటియా 4–0–30–1.