భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రికెట్ ప్రపంచంలో సంపన్న బోర్డుగా పేరుగాంచింన సంగతి విదితమే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విషయంలో 2023-27 కాలానికి గానూ 48 వేల కోట్ల రూపాయలు ఆర్జించి మరోసారి తన విలువను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన స్పోర్ట్స్ ప్రాపర్టీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందని (Whatever they say, will happen) వ్యాఖ్యానించాడు.
ఈ మేరకు సామా టీవీ షోలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘‘మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం. క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియా. కాబట్టి వాళ్లేం చెబితే అదే ఇక్కడ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక గతంలో ఐపీఎల్‌ను అతి పెద్ద బ్రాండ్ లీగ్‌గా అభివర్ణించిన ఆఫ్రిది.. ఇలాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం పెద్ద లోటు అని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే క్రికెటేతర కారణాల వల్ల ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే.
పీఎల్‌లో భాగస్వామ్యమైన క్రికెటర్లు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా దూరమవుతున్నారన్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. దీని కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ) క్యాలెండర్‌లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.