Shubman Gill (Photo-Twitter/BCCI)

వెస్టిండీస్‌తో టెస్టుల్లో దారుణంగా విఫలమైన టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 6, 10, 29(నాటౌట్‌) పరుగులు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌నూ సింగిల్‌ డిజిట్‌ స్కోరు(7)తోనే ఆరంభించిన గిల్‌పై విమర్శలు కొనసాగాయి.

రెండో వన్డేలో 34 పరుగులు సాధించినప్పటికీ జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన గిల్‌ మళ్లీ అభిమానులకు టార్గెట్‌ అయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడితో కూరుకున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. హాఫ్‌ సెంచరీతో మెరిసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అద్భుత ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించాడు.

18 ఏళ్ల తన రికార్డును తిరగరాసుకున్న టీమిండియా, మూడో వన్డేలో వెస్టిండీస్‌పై ఘన విజయంతో సరికొత్త చరిత్ర

ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో సగటు 62.48తో 1437 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక గత మ్యాచ్‌లో 1352 పరుగుల వద్ద ఉన్న గిల్‌.. బాబర్‌ ఆజం(1322)ను అధిగమించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ వన్డేల్లో 27 వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

1.శుబ్‌మన్‌ గిల్‌- 1437

2.ఇమాన్‌ ఉల్‌ హక్‌- 1381

3.రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌- 1353

4.రియాన్‌ టెన్‌ డొషాటే- 1353

5. జొనాథన్‌ ట్రాట్‌- 1342.