వెస్టిండీస్‌పై చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 స్కోర్‌లైన్‌తో కైవసం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని బెంచ్ కి పరిమితం చేసిన ఇండియా దుమ్మురేపింది. ముఖ్యంగా రెండవ ODIలో పరాజయం తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిజంగా అంచనాలకు అనుగుణంగా ప్లానింగ్ చేయడంతో చివరకు ఫలితం దక్కింది.
ఇషాన్ కిషన్ (77), శుభ్‌మన్ గిల్ (85) భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో , హార్దిక్ స్వయంగా 70 పరుగుల వద్ద అజేయంగా నిలిచి భారత్‌ను 50 ఓవర్లలో 351/5 భారీ స్కోరుకు తీసుకెళ్లారు. తర్వాత, ఆతిథ్య జట్టు కేవలం 151 పరుగులకే ఆలౌటైంది.
ఇంతటి భారీ విజయంతో, ఏ ఆటగాడు సెంచరీ కొట్టకుండానే టీమ్ ఇండియా కూడా తమ అత్యధిక వన్డే స్కోరును నమోదు చేసింది. వన్డే వరల్డ్‌కప్-2023కి అర్హత కూడా సాధించని విండీస్ చేతిలో గత మ్యాచ్‌లో ఓడిన హార్దిక్ సేన.. తదుపరి మ్యాచ్‌లోనే ఈ మేరకు అదరగొట్టడం విశేషం.
అదే విధంగా.. బ్రియన్ లారా స్టేడియంలో మూడో వన్డే సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.18 ఏళ్ల తన రికార్డును తిరగరాస్తూ.. జట్టులో ఒక్క ఆటగాడు కూడా సెంచరీ సాధించకుండానే అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతంలో.. 2005- నాగ్‌పూర్‌లో శ్రీలంకపై 350/6, 2004- కరాచిలో పాకిస్తాన్‌పై 349/7, 2004- ఢాకాలో బంగ్లాదేశ్‌పై 348/5 స్కోర్లు సాధించింది.