చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-15వ సీజన్‌లో (IPL 2022) మూడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) (57 బంతుల్లో 99; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ మిస్ చేసుకోగా.. కాన్వే (Devon Conway) (55 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. తాజా సీజన్‌లో మెరుపు వేగంతో బంతులేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ (0/48) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, ఒక సిక్సర్), కేన్ విలియమ్సన్ (47; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆరంభం నుంచి ధాటిగా ఆడటంతో రైజర్స్‌కు శుభారంభం దక్కింది. వీరిద్దరి జోరుతో 4 ఓవర్లలోనే 46 పరుగులు జోడించిన హైదరాబాద్ ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించలేకపోయింది.
ఆరో ఓవర్‌లో ముఖేశ్ చౌదరీ వరుస బంతుల్లో అభిషేక్, రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేయగా.. రెండు సిక్సర్లతో ఆశలు రేపిన మార్క్మ్.్ర. మరో భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. 18వ ఓవర్లో శశాంక్ సింగ్ (15), వాషింగ్టన్ సుందర్ (2)ను ఔట్ చేసిన ముఖేశ్ రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. నికోలస్ పూరన్ (33 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.