రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore)హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, వరుసగా నాలుగో ఓటమితో హైదరాబాద్ ఆరో స్థానానికి పరిమితమైంది.
తొలుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 73 నాటౌట్, 8ఫోర్లు, 2 సిక్స్‌లు) (Faf du Plessis Shine) అజేయ అర్ధసెంచరీకి తోడు రజత్ పాటిదార్(48), మ్యాక్స్‌వెల్(33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 192/3 స్కోరు చేసింది. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెనర్ విరాట్ కోహ్లీ(0) వికెట్‌ను బెంగళూరు కోల్పోయింది.
లక్ష్యఛేదనకు దిగిన రైజర్స్..19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. హసరంగ డిసిల్వా(5/18) (Wanindu Hasaranga) ధాటికి రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు అభిషేక్‌శర్మ(0), విలియమ్సన్(0) సున్నాలు చుట్టారు. తన స్పిన్ మాయాజాలంతో మక్రామ్ (21), పూరన్(19), సుచిత్(2), శశాంక్‌సింగ్(8), ఉమ్రాన్ మాలిక్(0)ను ఔట్ చేసి హైదరాబాద్‌ను హసరంగ కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన హసరంగకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్ లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు మార్లు గోల్డెన్ డక్ ఔటయ్యాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు సార్లు కాగా, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో మరోమారు నిష్క్రమించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో కోహ్లీకి ఆరో డకౌట్ ఇది.