భారత మహిళల హాకీ ( Indian Women Hockey ) జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) సెమీస్‌లో ఇండియన్ జట్టు ప్రవేశించింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసింది. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా దెబ్బకొట్టింది. ఇటు స్ట్రైకర్లు.. అటు డిఫెన్స్ టీం చక్కగా రాణించడంతో గెలుపు భారత్ సొంతమైంది. తద్వారా 41 తర్వాత తొలిసారి క్వార్టర్స్ ఫైనల్‌కు చేరి అంచనాలను పెంచిన మహిళా జట్టు.. వాటిని నిజం చేస్తూ సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్ చేరింది.
ఇక గుర్జీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యేకంగా నిలిచింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా, హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించడం గమనార్హం. ఇక క్వార్టర్స్‌కు ముందు పూల్ ‘ఎ’లో భారత్ ( India Women's Hockey Team) లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడింది. ఏడు గోల్స్ చేసి, 14 గోల్స్ సమర్పించుకుంది. మరోవైపు పూల్ ‘బి’లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సంగతి తెలిసిందే. భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో సెమీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది భారత మహిళల జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. పూల్ ఏ లో ఇండియన్ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది. గ్రూపు స్టేజ్‌లో రెండు విజయాలు, మూడు పరాజయాలను నమోదు చేసింది.