
Tokyo, Augusut 1: మరోసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధు కు (PV Sindhu) నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్‌తో నిన్న జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తెలుగమ్మాయి ప్రయత్నం గెలిచేందుకు సరిపోలేదు. ఓవరాల్‌గా వీరిద్దరు తలపడిన 19 మ్యాచ్‌లలో తై జు చేతిలో సింధుకు ఇది 14వ పరాజయం.
ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం సాధించే అవకాశం కానీ, 2016 ‘రియో’లో సాధించిన రజత పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం గానీ సింధుకు లేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకునేందుకు ఆమె ప్రయత్నించనుంది. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో హి బింగ్ జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) 21–16, 13–21, 21–12తో తన దేశానికే చెందిన హి బింగ్ జియావోపై గెలుపొందింది.
సింధు, బింగ్ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు. కాగా.. ఈ ఫలితంపై సింధూ తాజాగా (PV Sindhu Reacts After Tokyo Olympics 2020 ) స్పందించింది. ఈ రోజు నాది కాదు (It Just Wasn’t My Day)బంగారు పతకం గెలుచుకునే అవకాశం చేజారినందుకు విచారంగా ఉందన్న ఆమె..కాంస్య పతకం గెలుచుకుంటానన్న నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేసింది. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాంస్య పతక మ్యాచ్ కోసం వ్యూహం రూపొందించుకుంటా. అంతా ముగిసిపోలేదు. నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని తెలిపింది.
మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ కాలం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న రికార్డుతో పాటు అత్యధికంగా 11 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్ తన పేరిటే ఉన్నా... తై జు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో గానీ, వరల్డ్ చాంపియన్‌షిప్‌లోగానీ విజేతగా నిలవలేదు. తొలి ఒలింపిక్ పతకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఇప్పుడు ఆమె ముందు నిలిచింది.