
Melbourne, January 19: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. తన కెరీర్ కు ముగింపు (Sania Mirza Retirement) పలకబోతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె ఆడుతోంది. విమెన్ డబుల్స్ లో ఉక్రెయిన్ కు చెందిన నదియా కిచెనోక్ తో కలిసి ఆడిన ఆమె... తొలి రౌండ్ లోనే ఓటమిపాలైంది. అనంతరం సానియా కీలక ప్రకటన చేసింది.
స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, 6-7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది.
తాజాగా తన కెరీర్ కు గుడ్ బై (Tennis Superstar Reveals Her Retirement Plans) చెప్పబోతున్నట్టు వెల్లడించింది. తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆమె తెలిపింది. 'ఓకే... నేను ఇకపై ఆడబోవడం లేదు' అని సింపుల్ గా చెప్పలేనని వ్యాఖ్యానించింది. టెన్నిస్ ఆడటం కోసం తన మూడేళ్ల కుమారుడితో కలిసి తాను సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తోందని... చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సానియా తెలిపింది. తన శరీరం కూడా ఇంతకు ముందులా సహకరించడం లేదని చెప్పింది.
ఈరోజు తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని... అయితే, ఈనాటి ఓటమికి ఇదే కారణమని తాను చెప్పడం లేదని వ్యాఖ్యానించింది. వయసు పెరుగుతోందని శారీరక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పింది. ఈ సీజన్ చివరి వరకు ఆడాలని తాను భావిస్తున్నానని... అయితే సీజన్ తర్వాత ( 2022 Season Will Be Her Last) కూడా ఆటలో కొనసాగడం అసాధ్యమని సానియా స్పష్టం చేసింది.
ఎనర్జీ ఎప్పుడూ ఒకేలా ఉండదని సానియా తెలిపింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ శారీరకంగా ఫిట్‌నెస్ సాధించేందుకు తాను ఎంతో కృషి చేశానని... ఈ క్రమంలో ఎందరో తల్లులకు స్ఫూర్తిగా నిలిచానని చెప్పింది. మళ్లీ టెన్నిస్ ఆడటానికి తాను ఎంతో కష్టపడ్డానని తెలిపింది. బరువును కోల్పోవడం, పాత ఫిట్ నెస్ ను సాధించడం కోసం చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్పింది. ఈ సీజన్ తర్వాత ఆట ఆడటానికి తన శరీరం సహకరిస్తుందని తాను భావించడం లేదని తెలిపింది. మరోవైపు, తన కెరీర్లో సానియా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుపొందింది.